శివాలయంలో చోరీ..

హుండీ పగులగొట్టి నగదు అపహరణ

శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శివాలయంలో గురువారం తెల్లవారుజామున చోరీ చోటుచేసుకుంది. ఆలయంలోని హుండీని గుర్తు తెలియని దుండగులు పగులగొట్టి అందులో ఉన్న నగదుతో పాటు కొన్ని వస్తు సామగ్రిని అపహరించినట్లు సమాచారం. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. అనంతరం ఈ విషయాన్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాస్ రెడ్డికి, పట్టణ పోలీసులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ ఈవో కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, చోరీ జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. హుండీలో ఎంత మొత్తంలో నగదు ఉందన్నది ఇంకా స్పష్టతకు రాలేదని, నగదు లెక్కలు మరియు ఇతర వస్తువుల వివరాలను ఆలయ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. చోరీకి సంబంధించిన పూర్తి నష్టం అంచనా నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ఘటనపై పట్టణ సీఐ నారాయణరెడ్డిని వివరణ కోరగా, ఇప్పటి వరకు ఆలయ అధికారులు లేదా పూజారుల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆలయంలో చోరీ జరగడం స్థానిక భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఆలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని భక్తులు పోలీసు, దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు.