యూరియాకు ముందస్తు బుకింగ్

  • రూ.10 సేవా రుసుముతో బుకింగ్ సౌకర్యం
  • పట్టాదారు పాస్‌పుస్తకం, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి
  • పోడు రైతులకు కూడా అవకాశం
  • ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా యూరియా ముందస్తు బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు జయశంకర్ జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ తెలిపారు. రైతులు తమకు సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో ముందుగానే యూరియాను బుక్ చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అవసరమైన పత్రాలు ఇవే..
యూరియా బుకింగ్ కోసం పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. బుకింగ్ పూర్తయిన అనంతరం ప్రత్యేక ఐడీతో కూడిన రసీదును రైతులకు అందజేస్తామని చెప్పారు.

పోడు రైతులకు కూడా అవకాశం
పోడు పట్టాలు కలిగిన రైతులు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చని శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.10 సేవా రుసుము చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

ఆధార్‌తోనూ బుకింగ్ సౌకర్యం
మొబైల్ నంబర్ మార్పు, కౌలు రైతుల నమోదు కోసం సంబంధిత రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని సూచించారు. డిజిటల్ సంతకం పూర్తికాని భూముల పట్టాదారులు కూడా ఆధార్ ఆధారంగా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్ వెల్లడించారు.