ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మైనర్ బాలురకు తీవ్ర గాయాలు
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసుల హెచ్చరిక
పెద్దవంగర, ఆంధ్రప్రభ: అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్ బాలురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామంలో దుర్గమ్మ గుడి సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
కొరిపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అసద్, గొట్టిముక్కల సిద్ధార్థ్‌రెడ్డి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ను వేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బంపర్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలయ్యాయి.
బాలుర పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని పోలీసు శాఖ పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, వారి ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మైనర్లు వాహనాలు నడిపితే సంబంధిత చట్టాల ప్రకారం తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
