ఆర్ఎఫ్సీఎల్ లో నిలిచిన యూరియా ఉత్పత్తులు
- ఐదు రాష్ట్రాల్లో అన్నదాతలకు యూరియా కష్టాలు
- నిర్లక్ష్యం ఎవరిదైనా ఖరీఫ్ సీజన్లో సాగుకు గట్టి దెబ్బ
- మరమ్మత్తులకు 15 రోజులు పట్టే అవకాశం
గోదావరిఖని, ఆంధ్రప్రభ: వ్యవసాయానికి మళ్లీ యూరియా కష్టాలు ఎదురు పడబోతున్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో సాంకేతిక లోపం కారణంగా హామోనియా పైప్ లీకేజీ తో ప్లాంట్ షట్ డౌన్ అయింది. బుధవారం అర్ధరాత్రి నుండి ఆర్ఎఫ్సీఎల్ లో యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. యుద్ధ ప్రాతిపదికన ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం మరమ్మత్తు చర్యలను మొదలు పెట్టింది.
రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపం పర్యవసరంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వ్యవసాయానికి షాక్ ఇస్తుంది. ఈ సంవత్సరం యాసంగి సీజన్లో కూడా ఆర్ఎఫ్సీఎల్ లో సాంకేతిక లోపం కారణంగా యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలో సాగుకు యూరియా కష్టాలను తెచ్చిపెట్టింది.
2021 ఆర్ఎఫ్సీఎల్ కీలక పాత్ర
రామగుండం యూనిట్ 2021 మార్చి 22న వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి యూరియా ఉత్పత్తిలో ఆర్ఎఫ్సీఎల్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఎందుకో మరి… ప్లాంట్ లో హామోనియా పైప్ లీక్ కావడం… తరచుగా సాంకేతిక లోపాలు ఏర్పడడం… దీని ఫలితంగా యూరియా ఉత్పత్తులు నిలిచిపోవడంతో రాష్ట్రంలో విస్తారంగా చేపట్టాలన్న వ్యవసాయం సాగుపై ఆర్ఎఫ్సీఎల్ షట్ డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ లో సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడల్లా రోజుల తరబడి షట్ డౌన్ జరుగుతోంది. దీంతో మరమ్మత్తు చర్యలు చేపట్టి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలంటే కోట్లాది రూపాయల ఖర్చు అవుతుందనేది ఎవరు కాదనలేని సత్యం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మరమ్మత్తు చర్యలు చేపడుతున్న… కొద్ది నెలల్లోనే మళ్లీ సాంకేతిక లోపాల సమస్యలు తలెత్తడానికి అసలు కారణం ఏంటి అనేది..!? ఇక్కడ ఒక అంతుచి కలిసిన ప్రశ్న వినిపిస్తోంది.
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో చోటు చేసుకున్న కొన్ని లోపాల కారణంగానే తరచుగా ప్లాంట్ సాంకేతిక లోపానికి గురవుతుందన్న ఆరోపణలు… విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భారతదేశానికి యూరియా ఉత్పత్తిలో గుండెకాయగా నిలుస్తున్న ఆర్ఎఫ్సీఎల్ లో తరచుగా ఏర్పడుతున్న సాంకేతిక లోపాలకు శాశ్వత పరిష్కారం చూపించడంలో ఉన్నతాధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే కారణమన్న విమర్శలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు..
వ్యవసాయానికి కీలకంగా ఉండే యూరియా ఉత్పత్తుల ప్లాంట్ల వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికార యంత్రాంగం స్థానికంగా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఏదైనా ప్లాంట్ లో కీలకమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడుఆర్ఎఫ్సీఎల్ కు సంబంధించిన ఉన్నతాధికార యంత్రాంగం ఢిల్లీ నుండే మానిటరింగ్ చేస్తూ స్థానికంగా పర్యవేక్షణ లేని కారణంగానే ఇలాంటి సాంకేతిక లోపం ఘటనలకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదనేది ఇక్కడ ఎక్కువగా చర్చ జరుగుతుంది.
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. జూన్–2026లో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ మొత్తం 94,849 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేయగా, 97,094.70 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.
దీనిలో రాష్ట్రాలవారీగా….
• తెలంగాణకు 48,675.33 మెట్రిక్ టన్నులు
• ఆంధ్రప్రదేశ్‌కు 11,308.23 మెట్రిక్ టన్నులు
• కర్ణాటకకు 28,338.66 మెట్రిక్ టన్నులు
• తమిళనాడుకు 5,655.60 మెట్రిక్ టన్నులు
• మహారాష్ట్రకు 3,116.88 మెట్రిక్ టన్నులు
సరఫరా జరుగుతుండగా… ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ సాంకేతిక లోపానికి గురై షట్ డౌన్ తో ఐదు రాష్ట్రాల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు యూరియా కష్టాలు ఎదురవడం తప్పదని తెలుస్తోంది. మరమ్మతు చర్యలను కొనసాగిస్తున్న క్రమంలో ఈ మరమ్మత్తులు పూర్తి కావాలంటే సుమారుగా మరో 15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఏది ఏమైనా… నిర్లక్ష్యం ఎవరిదైనా… సాంకేతిక లోపం దేశంలోని ఐదు రాష్ట్రాల వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందనేది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటికైనా ఆర్ ఎఫ్ సి ఎల్ ఢిల్లీ ఉన్నత అధికార యంత్రాంగం ప్లాంట్ లో తరచుగా సాంకేతిక లోపాలు ఎదురవకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
