ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

  • బీఆర్ఎస్ నేతల ఆరోపణలు రాజకీయ దుష్ప్రచారమేనన్న కాంగ్రెస్ నేత
  • ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా
  • కలెక్టర్ డీసీఓలతో విచారణ జరిపించండి
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోరిట పీఎసీఎస్ లో రూ. కోటి 20 లక్షల కుంభకోణం
  • కాంగ్రెస్ నేత మార్కెట్ చైర్మన్ రమణారావు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: పెద్దముద్దునూరు గ్రామంలో జరిగిన మొక్కజొన్న కొనుగోళ్లలో తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపించాలని, జిల్లా కలెక్టర్‌తో పాటు సహకార శాఖ అధికారులతో విచారణ జరిపించాలని నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు సవాల్ చేశారు. విచారణలో తాను అవినీతికి పాల్పడినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై బురదజల్లే రాజకీయాలకు బీఆర్ఎస్ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పెద్దముద్దునూరు గ్రామంలో పీఏసీఎస్ ద్వారా 473 మంది రైతుల నుంచి 26,836 క్వింటాళ్ల మొక్కజొన్నను 52 వేల సంచుల్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 47 వేల సంచులు అందజేశామని, కొంత సరుకును లారీల ద్వారా, మిగిలినదాన్ని ట్రాక్టర్ల ద్వారా నాగనూలు కేంద్రానికి తరలించామని వివరించారు.

ఒక్కో సంచికి రూ.10 చొప్పున మాత్రమే రవాణా చెల్లింపులు జరిగాయని, రూ.30 నుంచి రూ.35 వరకు చెల్లించారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మొత్తం సంచుల వ్యయమే రూ.4 లక్షల వరకు ఉంటే, రూ.44 లక్షల అవినీతి జరిగిందని చెప్పడం అవాస్తవమని పేర్కొన్నారు. తాను సీఈఓలను ఫోన్‌లో బెదిరించానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని రమణారావు అన్నారు. రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తేలితే తన ఇంటిని ముట్టడించినా అభ్యంతరం లేదని, గ్రామానికి వచ్చి రైతులనే అడిగి నిజానిజాలు తెలుసుకోవాలని సవాల్ విసిరారు.

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తిమ్మాజీపేట మండలం గొరిట పీఏసీఎస్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అలాగే మాజీ జెడ్పీటీసీ శ్రీశైలం మిషన్ భగీరథ పనుల్లో రూ.59 లక్షల అవినీతికి పాల్పడ్డారని, పెద్దముద్దునూరు గ్రామంలో రూ.9 లక్షల మోసం జరిగిందని ఆరోపించారు.

తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతులకు ఎదురైన లారీలు, బ్యాగుల కొరత వంటి సమస్యలను డైరెక్టర్లతో కలిసి పరిష్కరించామని, ఎలాంటి అవినీతికి తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నాయకులు కోటయ్య, గోపాల్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ హబీబ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక దందా, రియల్ ఎస్టేట్ మాఫియా, అవినీతి విస్తృతంగా జరిగాయని ఆరోపించారు.

ఈ సమావేశంలో బిజినపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములు, వైస్ చైర్మన్ జంగయ్య, కొత్త శ్రీనివాసులు, బుచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, జక్కా రాజు తదితరులు పాల్గొన్నారు.