కొత్తపల్లిలో మహిళా సమైక్య భవనానికి భూమిపూజ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ: మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం నిర్మిస్తున్న మహిళా సమైక్య భవనాలు దోహదపడతాయని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఆర్. నర్సిములు అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పథకం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనానికి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్. నర్సిములు మాట్లాడుతూ, మహిళలు స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, పొదుపు సంఘాల కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రత్యేక భవనం అందుబాటులోకి రావడం వల్ల వారి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని అన్నారు.

మహిళలు ఒకే వేదికపై సమావేశమై ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.

గ్రామీణ మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళా సమైక్య భవనాల నిర్మాణం కీలక అడుగని పేర్కొన్నారు. భవనం పూర్తయిన తర్వాత గ్రామంలోని మహిళా సంఘాలకు శాశ్వత వేదికగా ఉపయోగపడటంతో పాటు సామాజిక, ఆర్థిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివశంకర్, వార్డు సభ్యులు రామాంజనేయులు, లింగప్ప, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.