ex minister | అమరావతి ఖర్చులపై శైలజానాథ్ ఫైర్‌

ex minister | అమరావతి ఖర్చులపై శైలజానాథ్ ఫైర్‌

శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఐకానిక్ భవనాల వ్యయం, టెండర్ల వివరాలు ప్రజలకు వెల్లడించాలని మాజీ మంత్రి డిమాండ్
అప్పులు, ప్రాజెక్టు వ్యయంపై ప్రభుత్వాన్ని నిలదీసిన శైలజానాథ్

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అమరావతి రాజధాని ప్రాజెక్టు వ్యయం, నిర్మాణ పనుల తీరుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిని అప్పుల ప్రాజెక్టుగా మార్చారని ఆరోపిస్తూ, ఐకానిక్ భవనాల నిర్మాణానికి సంబంధించిన మొత్తం వ్యయంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతి పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో వరదలతో పాటు అవినీతి ప్రవాహం కూడా కొనసాగుతోందని ఆరోపించిన శైలజానాథ్, పనుల కేటాయింపులో పారదర్శకత లేదని విమర్శించారు. ఒకే సంస్థలకు పదేపదే టెండర్లు కట్టబెడుతున్నారని, నామినేషన్ విధానంలో పనులు అప్పగిస్తున్నారంటూ ఆరోపించారు.

అమరావతి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.44 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పెంచడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలోని జాతీయ రహదారుల నిర్మాణ వ్యయంతో పోలిస్తే అమరావతిలో రోడ్ల నిర్మాణానికి అధిక వ్యయం చూపుతున్నారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలల్లో భారీగా అప్పులు చేసినప్పటికీ, ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. అమరావతి కోసం సేకరించిన భూములు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని, గతంలో ప్రకటించిన అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.