Bapughat | రూ.7,345 కోట్లతో తొలి దశ పనులు

Bapughat | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు తొలి దశ పనులకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం రూ.7,345 కోట్ల వ్యయంతో జోన్-1 పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టును మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అమలు చేయనుండగా, ఇందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.4,500 కోట్ల రుణం వినియోగించనున్నారు.

జోన్-1ఏలో హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్ల మేర రూ.3,104 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అలాగే జోన్-1బీలో ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల పరిధిలో రూ.3,950 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.

ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ (PMC) నియామకానికి ప్రభుత్వం ఎంఆర్‌డీసీఎల్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది ప్రక్షాళనతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.