pt usha | తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం..

pt usha | తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభం..

భావితర క్రీడాకారులకు స్ఫూర్తి కేంద్రం: పి.టి. ఉష
హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు
క్రీడల్లో క్రమశిక్షణ, అంకితభావమే విజయానికి మార్గమ‌న్న‌ పి.టి. ఉష
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి వాకిటి శ్రీహరి

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన భవనాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు డా. పి.టి. ఉష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన డా. పి.టి. ఉష, తెలంగాణ ఒలింపిక్ భవనం భారత క్రీడా చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇది కేవలం పరిపాలనా భవనం మాత్రమే కాకుండా, భావితర క్రీడాకారుల కలలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని బలోపేతం చేసే వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని పేర్కొన్న ఆమె, రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల విస్తరణ, యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ పదాధికారులు, భవన నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

ఒలింపిక్ ఉద్యమం విజయవంతం కావాలంటే పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయబద్ధత వంటి విలువలను కచ్చితంగా పాటించాలని పి.టి. ఉష సూచించారు. క్రీడాకారుల సంక్షేమం, వారికి అత్యుత్తమ శిక్షణ, సౌకర్యాలు, ప్రోత్సాహం కల్పించడమే అన్ని క్రీడా సంస్థల ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అలాగే కోచ్‌లు, సాంకేతిక నిపుణులు, అధికారులు, వాలంటీర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారు.

యువ క్రీడాకారులకు ఆమె కీలక సందేశం ఇస్తూ.. తమపై తాము నమ్మకం ఉంచుకుని క్రమశిక్షణ, అంకితభావం, కఠోర శ్రమతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఛాంపియన్ ప్రయాణం ఒక కలతో ప్రారంభమవుతుందని, ఆ కలను నిజం చేసుకునే వరకు ప్రయత్నం ఆపవద్దని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. భారత క్రీడా చరిత్రలో మిల్కా సింగ్, పి.టి. ఉష వంటి దిగ్గజాలు దేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ యువత క్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాకు అధిక సమయం కేటాయించే బదులు ఆటలపై దృష్టి పెట్టాలని, క్రీడలను జీవిత లక్ష్యంగా ఎంచుకున్నప్పుడే విజయం సాధించగలరని యువతకు సూచించారు. భారీ జనాభా ఉన్న దేశమైనప్పటికీ పతకాల విషయంలో వెనుకబడటం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశమన్నారు. చిన్న దేశాలు సైతం అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్నాయని గుర్తుచేస్తూ, దేశం కోసం ఆడి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత పూర్తిగా సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు, దేశానికి కీర్తి తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.