బనగానపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు

‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెకు చేరుకున్నారు. ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొనేందుకు మధ్యాహ్నం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది.

ముఖ్యమంత్రికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం బనగానపల్లెలో ఏర్పాటు చేసిన ‘మీ భూమి – మీ హక్కు’ ప్రజావేదిక కార్యక్రమ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

రైతుల భూ హక్కులను బలోపేతం చేయడం, భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమంలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.