Mannanur | 40మంది విద్యార్థులకు అస్వస్థత..

Mannanur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం దాదాపు 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

విద్యార్థులకు వాంతులు, వికారం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో గురుకుల సిబ్బంది వెంటనే వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటనపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులంలో నాణ్యమైన ఆహారంతో పాటు తాగునీరు కూడా సరిగా అందించడం లేదని ఆరోపించారు. దీనివల్లే తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్‌కు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.