Rishabh Pant | ఎల్‌ఎస్‌జీ కెప్టెన్సీకి గుడ్‌బై

Rishabh Pant | ఎల్‌ఎస్‌జీ కెప్టెన్సీకి గుడ్‌బై

జట్టు భవిష్యత్ వ్యూహాల్లో కీలక మార్పులు

Rishabh Pant | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ లక్నో సూపర్ జెయింట్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఐపీఎల్‌లో లక్నో జట్టు నాయకత్వంపై కొత్త చర్చకు తెరలేచింది.

ఐపీఎల్-2025 మెగా వేలంలో లఖ్‌నవూ ఫ్రాంచైజీ రిషభ్ పంత్‌ను రూ.27కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అనంతరం మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్థానంలో పంత్‌ను జట్టు సారథిగా నియమించింది. గత రెండు సీజన్లలో ఆయన జట్టుకు నాయకత్వం వహించారు.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం జట్టు యాజమాన్యాన్ని నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తన నిర్ణయానికి గల పూర్తి కారణాలను పంత్ ఇంకా వెల్లడించలేదు.

జట్టు యాజమాన్యం త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పంత్ మాత్రం ఆటగాడిగా జట్టుకు సేవలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్నో జట్టు తదుపరి నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందన్న అంశం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply