వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: కౌన్సిలర్ అప్పం కిషన్

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మరణీయమని భూపాలపల్లి 9వ వార్డు కౌన్సిలర్ అప్పం కిషన్ అన్నారు. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామంలోని ఆయన విగ్రహానికి అప్పం కిషన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. రైతుల అభ్యున్నతి కోసం ఉచిత విద్యుత్, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి అభివృద్ధికి జలయజ్ఞం వంటి అనేక పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో నిలిచారని తెలిపారు.

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వైఎస్సార్ ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణమూర్తి, రవీందర్, నరేష్, ప్రవీణ్, సతీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.