హక్కుల సాధన కోసం…

  • అవసరమైతే సింగరేణిలో సమ్మె
  • మెడికల్ బోర్డు నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం
  • కాంగ్రెస్ వచ్చాక రాజకీయ జోక్యం పెరిగింది
  • ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికుల హక్కుల సాధన కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎప్పుడు కూడా ముందుంటుందని, డిమాండ్లు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని ఏఐటీయూసీ అధ్యక్షుడు, గుర్తింపు సంఘం ముఖ్య నేత వాసిరెడ్డి సీతారామయ్య తేల్చి చెప్పారు.

శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఇటీవలనే యాజమాన్యానికి 31 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. యాజమాన్యానికి ఇచ్చిన డిమాండ్లను జాప్యం చేయకుండా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.

బొగ్గు పరిశ్రమలో మెడికల్ బోర్డు నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని సీతారామయ్య మండిపడ్డారు. సింగరేణిలో కొత్త గనుల నిర్మాణం కోసం ఏఐటీయూసీ ముందుండి పోరాటం చేస్తుందని, సింగరేణిలో వేజ్ బోర్డు సాధన కోసం అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామన్నారు.

2014 సంవత్సరం తర్వాతనే సింగరేణికి చెందిన సి ఎస్ ఆర్, డి ఎం ఎస్ టి నిధులు ఇతర ప్రాంతాలకు ఎక్కువగా తరలిపోవడం జరిగిందన్నారు. చందాల కోసం ఘర్షణలు పడి జైల్లోకి వెళ్ళింది తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం అని సీతారామయ్య గుర్తు చేశారు. ఏఐటీయూసీ నిరంతరం కార్మికుల పక్షపాతిగా ఉంటుందని… వామపక్ష పార్టీలు మాత్రమే కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడుతాయని చెప్పారు. మెడికల్ బోర్డు నిర్వహణ చేయకుంటే ఊరుకునేది లేదని సీతారామయ్య తెగేసి చెప్పారు.

ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం మూలంగానే సింగరేణి బొగ్గు పరిశ్రమ సర్వనాశనమైందని ఆరోపించారు. టిఆర్ఎస్ హయాంలోనే సింగరేణి బొగ్గు పరిశ్రమలు బొగ్గు బ్లాగులను అమ్ముకున్నారని విమర్శించారు. కంపెనీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. ఏఐటీయూసీ అంటేనే పారదర్శకతకు కేరాఫ్ అడ్రస్ అని రాజ్ కుమార్ నొక్కి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గౌడ్, కేంద్ర కమిటీ సభ్యుడు కే స్వామి, నాయకులు వైవి రావు, రాజరత్నం, గౌతమ్ గోవర్ధన్, టి రమేష్ కుమార్ తోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.