రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది: మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
కుంటాల, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత లభిస్తోందని మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ కుంటాల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతును రాజుగా చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతు భరోసాతో పాటు రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం, విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ దాసరి మధు, తాటి మహిపాల్, మహేష్, సబ్బిడి గజేందర్, రాకేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
