దండేపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ఓపీ సేవలు, ప్రతిరోజూ చికిత్స కోసం వచ్చే రోగుల వివరాలను పరిశీలించారు. ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల వివరాలను సేకరించి సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా నీటిని కాచి, చల్లార్చి, వడపోసిన తర్వాతే తాగేలా ప్రజలకు సూచించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రజల్లో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ లక్ష్మీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
