Fake accounts | ‘కాళేశ్వరం కాదు.. డ్రామేశ్వరం’
Fake accounts | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిలో ఫేక్ అకౌంట్లు వెలుగుచూశాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్లలోనే సుమారు రెండు వేల ఫేక్ అకౌంట్లు బయటపడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ధరణి వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భూభారతిలో జరుగుతున్న అవకతవకలపైనా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భూభారతి వ్యవస్థలో అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భూభారతి, ధరణి వ్యవహారాల్లో అవకతవకలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం రాజకీయ నాటకాలు ఆడుతున్నాయని రామచందర్ రావు విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో కన్నెపల్లి, మేడిగడ్డ అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును “డ్రామేశ్వరం”గా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
