చిన్నారుల భవిష్యత్తుకు భరోసా
చిన్నారుల భవిష్యత్తుకు భరోసా
- ఘనంగా పల్స్ పోలియో ప్రారంభం
- రెండు చుక్కలు.. జీవితాంతం రక్ష
- మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ్ చంద్ర
రాయపర్తి, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజమే మన లక్ష్యం అనే నినాదంతో రాయపర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సహేంద్ర బిక్షపతి ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమానికి మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ్ చంద్ర ముఖ్యఅతిథిగా హాజరై, స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అరుణ్ చంద్ర మాట్లాడుతూ.. పోలియో చుక్కల ఆవశ్యకతను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. పోలియో అనేది ఒక వైరస్ వల్ల వచ్చే భయంకరమైన వ్యాధి. ఒకసారి సోకితే జీవితాంతం అంగవైకల్యం తప్పదు. దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. ఆ నివారణే ఈ రెండు చుక్కలని స్పష్టం చేశారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదను, మీ ఇంట్లో, మీ వీధిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఉంటే వెంటనే సమీప పోలియో బూత్‌కు తీసుకురండి. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, ప్రతి తల్లిదండ్రుల బాధ్యతని ఆయన పిలుపునిచ్చారు. రెండు చుక్కలు వేయిస్తే.. జీవితాంతం పోలియో నుంచి రక్షణ అనే నినాదాన్ని ప్రజలతో స్వయంగా చెప్పించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ సహేంద్ర బిక్షపతి మాట్లాడుతూ.. మన గ్రామం, మన పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత. గ్రామపంచాయతీ తరపున పల్స్ పోలియో కార్యక్రమం 100 శాతం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. గ్రామంలోని యువత, మహిళా సంఘాలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్నారు. రాయపర్తి మండల కేంద్రంలోనే కాకుండా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోనూ ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం ఒకేసారి ప్రారంభమైంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, వైద్యాధికారులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. బస్టాండ్, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి, ప్రయాణాల్లో ఉన్న చిన్నారులకు సైతం చుక్కలు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
