బీఆర్ఎస్‌ది బూటకపు చేరికల డ్రామా: కాంగ్రెస్

  • సొంత కార్యకర్తలకే కండువాలు కప్పి కాంగ్రెస్ నుంచి చేరారంటూ ప్రచారం..
  • నిజంగా కాంగ్రెస్ నేతలైతే ఒక్క పదవి అయినా చూపించాలని సవాల్..

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం మండలంలో లక్ష్మిపురం గ్రామంలో బీఆర్ఎస్ నిర్వహించిన చేరికల కార్యక్రమం బూటకమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎండీ అప్సర్ పాషా విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే గులాబీ కండువాలు కప్పి కాంగ్రెస్ నుంచి భారీ చేరికలు జరిగాయని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అన్నారు.

మంగళవారం బీఆర్ఎస్‌లో చేరిన వారిలో ఒక్కరికీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారు నిజంగా కాంగ్రెస్ నాయకులైతే పార్టీ తరఫున నిర్వహించిన కనీసం ఒక్క పదవి అయినా చూపించాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్‌కు కన్నాయిగూడెం మండలంలో ప్రజా మద్దతు లేకపోవడంతో ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లక్ష్మిపురం గ్రామానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు, ప్రజాదర్బార్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పింఛన్లు, సన్నబియ్యం వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.

ప్రజా ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు, ఇకనైనా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.