వైఎస్సార్ జయంతి వేడుకల్లో షర్మిల

వైఎస్సార్ జయంతి వేడుకల్లో షర్మిల

కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి నివాళులు

వైఎస్సార్ సేవలు, సంక్షేమ పాలనను స్మరించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి పథకాలతో చిరస్థాయిగా నిలిచారన్న షర్మిల
వైఎస్సార్‌ను స్మరిస్తున్న కోట్లాది తెలుగు ప్రజలకు కుటుంబం తరఫున కృతజ్ఞతలు

ఆంధ్ర్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన కుమారుడు రాజారెడ్డి, కోడలు ప్రియా అట్లూరి, కుమార్తె అంజలి రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతి వేడుకలను నిర్వహించారు.

వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్ షర్మిల, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు. నాయకులు మరణించినా వారి ఆలోచనలు, సేవలు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, ఆ అర్థంలో వైఎస్సార్‌కు మరణం లేదని ఆమె అన్నారు.

ముఖ్యమంత్రిగా కేవలం ఐదేళ్లపాటు మాత్రమే పనిచేసినా, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాలను వైఎస్సార్ అత్యంత చిత్తశుద్ధితో అమలు చేశారని గుర్తు చేశారు.

వైఎస్సార్ ఆకస్మిక మరణం అనంతరం ఆయనపై ఉన్న అపారమైన ప్రజాభిమానానికి నిదర్శనంగా అనేక మంది తీవ్ర విషాదానికి గురయ్యారని షర్మిల పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం ఎంత గొప్పదో ఆ సంఘటనలు తెలియజేస్తాయని అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్న కోట్లాది తెలుగు ప్రజలకు రాజశేఖరరెడ్డి కుటుంబం తరఫున ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రేమ, ఆదరణే వైఎస్సార్‌కు లభించిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.