సర్పంచ్‌పై అక్రమ ఫిల్టర్ ఇసుక రవాణా ఆరోపణలు

మహబూబ్‌నగర్ రూరల్ (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రపురం గ్రామంలో ఫిల్టర్ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని, దీనికి గ్రామ సర్పంచ్ వై. నర్సింలు అండదండలు ఉన్నాయంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో అక్రమ ఇసుక వ్యాపారం నిర్భయంగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని ఫిల్టర్ ఇసుకను ట్రాక్టర్ లోడును రూ.3,600 నుంచి రూ.4,000 వరకు, బెంజ్ టిప్పర్ లోడును రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో రోజుకు 60 నుంచి 100 టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా భారీ ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని, ఇందులో ఉపసర్పంచ్ కూడా భాగస్వామిగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే కోడూరు రెవెన్యూ పరిధిలోని మన్యంకొండ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో కూడా భారీ ఎత్తున ఫిల్టర్ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. పోతనపల్లి గ్రామానికి చెందిన గొల్ల హనుమంతు అనే వ్యక్తి చాలాకాలంగా ఈ వ్యాపారం నిర్వహిస్తూ, ఒక్కో బెంజ్ లోడును రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ ఇసుక దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఈ ఆరోపణలపై ‘ఆంధ్రప్రభ’ సర్పంచ్ వై. నర్సింలును వివరణ కోరగా, “నేనే చేస్తున్నా… నేనే అమ్ముతున్నా… ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోండి” అంటూ బదులిచ్చారు.