ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నడిగూడెం (ఆంధ్రప్రభ): ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన స్వగ్రామమైన కరివిరాలలో బుధవారం నిర్వహించిన ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని పూరించి సంబంధిత అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇది 14వ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం, అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టి ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందిస్తారని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి సందేహాలు లేకుండా నిర్ణీత గడువులోపు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేషన్ ఫారం నింపేలా బూత్ ఏజెంట్లు ప్రజలకు అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
