ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియలు
యాదాద్రి భువనగిరి (ఆంధ్రప్రభ): మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి అంత్యక్రియల తేదీ, సమయం, వేదికను ఖరారు చేసి, ప్రభుత్వ గౌరవాలతో పాటు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు కొమ్మిడి నరసింహారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక గౌరవాలతో అంతిమ వీడ్కోలు పలకనుంది.
