టీం వర్క్‌తో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం

టీం వర్క్‌తో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం
– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక బుధవారం సజావుగా, సర్వసభ్య సమ్మతితో ముగిసింది. కోఆప్షన్ సభ్యులుగా పస్తం గంగారాం, సందగళ్ల విజయ సతీష్ గౌడ్, బాబా షరీఫ్, షేక్ నబీబి జానీబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన నలుగురు సభ్యులను శాలువాతో సత్కరించి, నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
పూర్తి మెజారిటీతో ఏకగ్రీవం
మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. నిబంధనల ప్రకారం కోరం కోసం పదిమంది సభ్యులు హాజరుకావాల్సి ఉండగా, 12 మంది కౌన్సిలర్లు హాజరై కోరం పూర్తి చేశారు. ఎన్నికకు ప్రతిపాదించిన నలుగురు అభ్యర్థులకు హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో ఎన్నిక సజావుగా ముగిసింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి నూతన సభ్యులు పస్తం గంగారాం, సందగళ్ల విజయ సతీష్, బాబా షరీఫ్, షేక్ నబీబి జానీ బాబాలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
వెనుకబడిన వార్డులపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ “చౌటుప్పల్ మున్సిపాలిటీని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలి. ఇది ఒక్కరితో సాధ్యం కాదు. పాలకవర్గం, కోఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కలిసికట్టుగా టీం వర్క్‌తో పనిచేసినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది” అని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి నోచుకోని, వెనుకబడిన వార్డులను గుర్తించి వాటికి ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు. “అభివృద్ధి విషయంలో ఎలాంటి సందేహాలున్నా, సమస్యలున్నా నాతో ఎప్పటికప్పుడు చర్చించవచ్చునని, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటానని నూతన సభ్యులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు ఎండి హన్ను, దేప రమ్య రాజు, పిల్లలమర్రి మధుసూదన్, బత్తుల వాణి విప్లవ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, బద్రి గాలయ్య, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పాక చిరంజీవి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, మున్సిపల్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
