ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి

సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు ఎంఆర్ఓ

హసన్‌పర్తి (ఆంధ్రప్రభ): ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని హసన్‌పర్తి అదనపు మండల రెవెన్యూ అధికారి ఆకుల రవి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మండల కేంద్రంలోని పీఎస్ నంబర్-30 పరిధిలో ఇంటింటా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పర్యవేక్షించి, సూపర్‌వైజర్, బీఎల్‌ఓలతో మాట్లాడి ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆకుల రవి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని తెలిపారు. ఇంటింటికి వచ్చే బీఎల్‌ఓలకు ఓటర్లు పూర్తిగా సహకరించాలని, ఎన్యూమరేషన్ పత్రాన్ని తిరిగి ఇవ్వకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని వివరించారు.

పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, ప్రజలు, సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ మేకల రమేష్, బీఎల్‌ఓ ఆరేపల్లి నిర్మల పాల్గొన్నారు.