అక్రమంగా తరలిస్తున్న గుడుంబా పట్టివేత
- 210 లీటర్ల గుడుంబా విలువ 84 వేల రూపాయలు
- సిజి బస్ స్వాధీనం నలుగురి పై కేసు నమోదు
వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ గుడుంబా రవాణాను అడ్డుకుని 210 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం టేకులగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి–163పై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి టేకులగూడెం వైపు వస్తున్న CG17KS-7002 నంబర్ గల బస్సును పోలీసులు తనిఖీ చేశారు.
పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఆపిన బస్సును పరిశీలించగా డిక్కీలో మూడు బస్తాల్లో ప్యాక్ చేసిన గుడుంబా గుర్తించారు. మొత్తం 210 లీటర్ల గుడుంబా ఉన్నట్లు నిర్ధారించారు. దీని విలువ సుమారు రూ.84,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక విచారణలో గుడుంబాను ఛత్తీస్‌గఢ్ నుంచి జనగామ రమణ (ధర్మారం), కావేరి (అయ్యవారిపేట)కు తరలిస్తున్నట్లు, బస్సు డ్రైవర్ ఉమేష్ కుమార్ యాదవ్, క్లీనర్ రమేష్ గౌడ్ సహకరించినట్లు తెలిసింది.
గుడుంబాను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసి బస్సుతో పాటు సరుకును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తెలిపారు. అక్రమ గుడుంబా తయారీ, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
