టీజీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ): ప్రజలకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల కేంద్రంలో టీజీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్ అభివృద్ధి పనులకు బుధవారం జిల్లా కలెక్టర్ ఎం. కేశవపాటి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధునిక వసతులతో బస్‌స్టేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందడంతో పాటు ప్రాంతీయ రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. ప్రజా రవాణా రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తున్నామని, రవాణా, విద్య, వైద్యం తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.