సన్న ధాన్యం టెండర్లలో సిండికేట్ ఆరోపణలు.. ఈ-వేలం ప్రక్రియపై అనుమానాలు
సన్న ధాన్యం టెండర్లలో సిండికేట్ ఆరోపణలు.. ఈ-వేలం ప్రక్రియపై అనుమానాలు
తక్కువ కోట్‌లతో టెండర్ల రద్దు.. పారదర్శకతపై ప్రశ్నలు
మిల్లర్లు–అధికారుల కుమ్మక్కు ఆరోపణలు.. విచారణకు డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు పంపిణీ చేసే సన్నరకం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో తెరవెనుక సిండికేట్ నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. టెండర్ల ఈ-ప్రక్రియను కొందరు అధికారులు, రైస్ మిల్లర్లు కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల జరిగిన సన్నరకం ధాన్యపు టెండర్ల పర్వం పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అంతర్గత లొసుగులను బట్టబయలు చేసింది. సన్నరకం ధాన్యానికి టెండర్లు పిలిచినప్పటి నుంచి వాటిని రద్దు చేసే వరకు జరిగిన పరిణామాలు పౌరసరఫరాల శాఖ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని రైస్ మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని విక్రయించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గత నెల 20న గ్లోబల్ ఈ-వేలం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిల్వ ఉన్న ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బిడ్లను ఆహ్వానించినట్లు అధికారులు ప్రకటించారు.
అయితే టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెండర్లలో పాల్గొన్న వారి సంఖ్య, బిడ్లు వేసిన మిల్లర్ల వివరాలు, కోట్ చేసిన ధరలు వంటి ప్రాథమిక సమాచారం కూడా శాఖలోని ఉన్నతాధికారుల వద్ద లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ-టెండర్ ప్రక్రియలో ప్రతి దశ డిజిటల్‌గా నమోదవుతుంటే, ఇలాంటి వివరాలు అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాంకేతిక కారణమా, లేక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హడావుడిగా టెండర్ల రద్దు
2025-26 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ఈ ధాన్య విక్రయానికి క్వింటాకు కనీస ధరను రూ.3,405గా నిర్ణయించారు. అయితే నిర్దేశిత ధర కంటే తక్కువ కోట్ వచ్చిందనే కారణంతో అధికారులు టెండర్లను హడావుడిగా రద్దు చేశారు.
అసలు ఎంతమంది బిడ్లు వేశారో, ఎవరెవరు పాల్గొన్నారో అనే వివరాలే లేనప్పుడు తక్కువ ధర కోట్ అయిందని అధికారులు ఎలా నిర్ధారించారన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.
ఈ పరిణామాల వెనుక కొందరు రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి టెండర్ ప్రక్రియను తమకు అనుకూలంగా మలచేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో సన్నరకం ధాన్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం రాకుండా, తాము అనుకున్న ధరలకే ధాన్యం దక్కేలా వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారంలో పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు కూడా మిల్లర్లకు సహకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టెండర్ల రద్దు తర్వాత ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై కూడా ఆసక్తి నెలకొంది. పారదర్శకంగా మళ్లీ కొత్త ఈ-టెండర్లను ఆహ్వానిస్తారా? లేక సమయం లేదనే కారణంతో నామినేషన్ పద్ధతిలో లేదా ఇతర మార్గాల ద్వారా ధాన్యాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తారా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
తనిఖీల లీకులిస్తున్న అధికారులు
ఇప్పటికే పౌరసరఫరాల శాఖపై పలు ఆరోపణలు ఉన్నాయి. సీఎంఆర్ బియ్యం సేకరణలో జాప్యం, గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోకపోవడం, తనిఖీలకు ముందు కొందరు అధికారులే సమాచారం చేరవేస్తున్నారనే విమర్శలు గతంలోనూ వినిపించాయి.
విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాలు బయటపడినా నెలల తరబడి చర్యలు లేకపోవడం కూడా శాఖ పనితీరుపై అనుమానాలను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో సన్నరకం ధాన్యం టెండర్ల వ్యవహారం ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక పరీక్షగా మారింది. ఈ-వేలం ప్రక్రియపై వచ్చిన అనుమానాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెరదించి, టెండర్ల వివరాలను బహిర్గతం చేయడంతో పాటు అవసరమైతే సమగ్ర విచారణ చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
లేదంటే సిండికేట్ ఆరోపణలు మరింత బలపడే అవకాశం ఉందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
