రూ.40 లక్షలతో వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ షెడ్‌కు భూమిపూజ

ప్రతి మండలానికి ఒక యూనిట్ ఏర్పాటు లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామపంచాయతీలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ షెడ్‌కు మంగళవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యర్థ ప్లాస్టిక్‌ను కూడా ఉపయోగపడేలా మార్చేందుకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక వేస్ట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం కాంట్రాక్టర్ సయ్యద్ ఇక్బాల్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో లక్కారం సర్పంచ్ రేణుక, కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు డాక్టర్ దాసండ్ల ప్రభాకర్, ఆదిలాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, ఉట్నూర్ సహకార సంఘం చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, ఉట్నూర్ తహసీల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, మండల పంచాయతీ అధికారి సుధీర్ రెడ్డి, లక్కారం పంచాయతీ కార్యదర్శి ఉప్పుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు కొత్తపెల్లి మహేందర్, బిరుదుల లాజర్, మెస్రం ఓమేష్, కోడి ప్రభాకర్, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.