సివిల్ భూ తగాదాల్లో పోలీసుల జోక్యం ఉండదు

డ్రగ్స్‌, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి

ధర్మారం, ఆంధ్రప్రభ : సివిల్ భూ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని, అలాంటి వివాదాల విషయంలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా పరస్పర అవగాహనతో లేదా న్యాయపరంగా పరిష్కారం పొందాలని పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి సూచించారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్‌ను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి సందర్శించిన ఆయన, స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ధర్మారం మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా సివిల్ భూ తగాదాల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులతో పాటు సమాజంపైనా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఎవరైనా అందిస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ నాయక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సమాజంలో జరిగే నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి, సకాలంలో పోలీసులకు సమాచారం అందిస్తే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ధర్మారం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి నిర్వహణ సంతృప్తికరంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ధర్మారం ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.