ప్రాజెక్టుల భూసేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలి..
ప్రాజెక్టుల భూసేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలి..
అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వటేం 8వ ప్యాకేజ్ హౌస్ గెస్ట్ హౌస్‌లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (కేఎల్ఐ), డిండి, ఉమామహేశ్వరం బాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ రిజర్వాయర్, కర్ణేతాండ్ర బాలెన్సింగ్ రిజర్వాయర్‌తో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష జరిగింది.
కాలువల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్‌హౌస్‌ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అలాగే భూ సేకరణలో పెండింగ్ కేసులు, రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయాలను కూడా పరిశీలించారు.ప్రాజెక్టుల పనులు ఆలస్యం కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
భూ సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని, పరిహారం చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ పూర్తికాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయినట్లు అధికారులు వివరించగా, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాలుగా ఉండటంతో, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా రైతుల ఆదాయం పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రధాన సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ అమరేందర్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
