ప్రకాశ్‌రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు..

చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత డిమాండ్

వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కదిరి పోలీసులకు వినతి

శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశ్‌రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేయడంతో పాటు హిందువులు, శ్రీరాముడు, దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

సామాజిక మాధ్యమాల వేదికగా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రకాశ్‌రాజ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి, సీపీఐ నాయకుడు కె. నారాయణ, అలాగే సీపీఎం నాయకత్వం మద్దతు ఇవ్వడం వారి వైఖరిని సూచిస్తోందని విమర్శించారు.

హిందూ సమాజం, దేవాలయాలు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వైఖరిని పునఃపరిశీలించి హిందూ సమాజానికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

ప్రకాశ్‌రాజ్‌పై తాను ఇచ్చిన ఫిర్యాదును చట్టపరంగా విచారించి, వాస్తవాలు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కదిరి పోలీసులను విష్ణువర్ధన్ రెడ్డి కోరారు.