నాగర్‌కర్నూల్ రవాణా రంగంలో కొత్త అధ్యాయం..
రూ.12 కోట్లతో నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన
ఈ నెల 8న మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం..
ప్రయాణికుల సౌకర్యాలే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా రవాణా వ్యవస్థలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 8వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
జిల్లా కేంద్రంగా నాగర్‌కర్నూల్ ఏర్పడి దాదాపు 13 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులు బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు సుదూర ప్రాంతాలకు డీలక్స్, సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ బస్టాండ్ అందుబాటులోకి వస్తే శ్రీశైలం, నంద్యాల, హైదరాబాద్, గుంటూరు, మాచర్ల, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. భవిష్యత్తులో కొల్లాపూర్–నంద్యాల జాతీయ రహదారి అభివృద్ధితో ఈ బస్టాండ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది.
రవాణా వ్యవస్థ బలోపేతం కావడం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, పాల వ్యాపారులు, చిన్న వ్యాపారులు, విద్యార్థులు తదితర వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అలాగే శ్రీశైలం దేవస్థానం, సోమశిల పర్యాటక కేంద్రం, నల్లమల్ల అటవీ ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంతాల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నాగర్‌కర్నూల్ బస్టాండ్‌కు 1979 నవంబర్ 8న అప్పటి ఎమ్మెల్యే ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. అనంతరం 1983 మే 20న అప్పటి ఎమ్మెల్యే వంగ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రారంభమైంది. 1992 ఫిబ్రవరి 23న అప్పటి ఎమ్మెల్యే వంగ మోహన్ గౌడ్, ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో బస్ డిపోను ప్రారంభించారు. దాదాపు 47 సంవత్సరాల తర్వాత పెరిగిన జనాభా, ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరోసారి ఆధునిక బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ తబితారాణి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, డిపో మేనేజర్ యాదయ్య పర్యవేక్షించారు. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
