ఉత్తమ ఉద్యోగి అవార్డు గ్రహీత బాబురావ్ పటేల్‌కు సన్మానం

డోంగ్లి, ఆంధ్రప్రభ: సహకార వారోత్సవాల్లో ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న డోంగ్లి సహకార సంఘం కార్యదర్శి బాబురావ్ పటేల్‌ను డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి సన్మానించారు.

మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో బాబురావ్ పటేల్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. సహకార రంగంలో ఆయన అందిస్తున్న సేవలు, రైతులకు చేస్తున్న సహాయాన్ని గజానంద్ దేశాయి ప్రశంసించారు.

ఈ సందర్భంగా గజానంద్ దేశాయి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బాబురావ్ పటేల్‌కు లభించిన ఉత్తమ ఉద్యోగి అవార్డు మండలానికి గర్వకారణమని అన్నారు. ఇలాంటి అధికారులు సహకార రంగం మరింత బలోపేతం కావడానికి దోహదపడతారని పేర్కొన్నారు.

అవార్డు అందుకున్న బాబురావ్ పటేల్ మాట్లాడుతూ, తనను గుర్తించి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో దోతి సర్పంచ్ సంగ్రామ్ పటేల్, నాయకులు ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, ధనంజయ్ పాటిల్, హన్మంత్ పాటిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.