ఎమ్మార్పీఎస్ లక్ష్యం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి
- ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవీందర్ మాదిగ
జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి, సంస్థ ఆశయాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి సందెన రవీందర్ మాదిగ మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ నిరంతరం పని చేస్తోందన్నారు. మాదిగ, మాల ఉపకులాల వర్గీకరణ సాధన కోసం 1994 ఏప్రిల్ 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో 20 మంది యువకులతో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించిందని తెలిపారు.
గత 32 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ లక్ష్యసాధనతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వాలపై పోరాటం చేస్తూ పలు లక్ష్యాలను సాధించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మాదిగ, మాల ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణను మూడు దశాబ్దాల పోరాటం అనంతరం సాధించుకున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాల్లో దేశవ్యాప్తంగా అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏబీసీడీ వర్గీకరణను దేశవ్యాప్తంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పేద, బడుగు, బలహీన వర్గాల ఆర్థికాభివృద్ధి, ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఎమ్మార్పీఎస్ ముందుండి పనిచేస్తుందని, వారి అభ్యున్నతే సంస్థ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, వార్డు సభ్యులు చీడకోడూరు ప్రేమ్ కుమార్, చిటూరు సారయ్య, సంజన రాములు, గండి విజయ్, చెన్నూరు మల్లేశం, జిల్లెల్ల రామచందర్, చందన అశోక్, శేఖర్, గండి మహేందర్, శ్రీకాంత్, బుచ్చయ్య, రమేష్, రవీందర్, లలిత, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.
