తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ఉపాధ్యాయుల పరామర్శ..

తల్లిని కోల్పోయిన విద్యార్థులకు ఉపాధ్యాయుల పరామర్శ..
నిత్యవసర సరుకులు అందజేత
పరకాల, ఆంధ్రప్రభ : తల్లిని కోల్పోయిన విద్యార్థుల కుటుంబాన్ని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న యాట రాజేందర్ మరియు 7వ తరగతి చదువుతున్న రమ్యశ్రీ అనే విద్యార్థుల తల్లి యాట నాగమణి (భర్త శంకర్) ఇటీవల అకాల మరణం చెందడం జరిగింది. తల్లిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ చిన్నారుల కుటుంబాన్ని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్, ఉపాధ్యాయ బృందం మరియు బోధనేతర సిబ్బంది తీవ్రంగా చలించిపోయారు.
ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో పాఠశాల సిబ్బంది అందరూ కలిసి మానవతా దృక్పథంతో 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను విద్యార్థుల ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిలువేరు సురేందర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలవడం తమ బాధ్యతని, భవిష్యత్తులో కూడా వారికి ఏ అవసరం వచ్చినా పాఠశాల తరపున తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ఉపాధ్యాయులను మరియు బోధనేతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
