అక్రమ ఇసుక రవాణా ఆరోపణలు అవాస్తవం: కోటగిరి సతీష్ గౌడ్
టేకుమట్ల, (ఆంధ్రప్రభ): భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లి వాగులో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ పేర్కొన్నారు. కోటంచగుడి నిర్మాణం కోసం సంబంధిత అధికారుల అనుమతులతోనే ఇసుకను తరలిస్తున్నామని, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని అడ్డుకున్నారని ఆరోపించారు.
సోమవారం సర్పంచులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణా జరిగినట్లు ఎవరైనా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారని తెలిపారు.
గతంలో బీఆర్ఎస్ పాలనలోనే అక్రమ ఇసుక, పెట్రోల్, కలప రవాణా జరిగిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుతం జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పెరుమాండ్ల చంద్రకళ మొగిలి, నేరెళ్ల రామకృష్ణ, నాంపల్లి వీరేశం, తోట సాగర్, పొన్నం సాంబయ్య, అంబాల కిరణ్, కుర్రె మల్లయ్య, మాజీ వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శి బండి రవీందర్, మాజీ సర్పంచులు చింతలపల్లి స్వామిరావు, అరకొండ రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు ఈసంపల్లి పోశాలు, మల్లేష్, నేరెళ్ల కుమార్, దేవేందర్, రాజేందర్‌తో పాటు పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
