మక్కల కొనుగోళ్లలో అవినీతిపై విచారణ జరపాలి

  • రైతు సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది..
  • చిట్యాలలో బీఆర్ఎస్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

చిట్యాల, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, మక్కల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు సొంతంగా హమాలీ, రవాణా తదితర ఖర్చులు భరించినప్పటికీ, గోదాంలలో స్థలం లేదని చెప్పి ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.

రైతులకు చెల్లించాల్సిన బిల్లుల్లో అక్రమంగా కోతలు విధించి ఒక్కో రైతుకు సుమారు రూ.10 వేల వరకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు రావాల్సిన మొత్తాన్ని పూర్తిస్థాయిలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యూరియా పంపిణీలో అమలు చేస్తున్న యాప్ విధానం వల్ల సెల్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న సులభమైన విధానంలోనే యూరియా పంపిణీ చేపట్టాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడిన గండ్ర వెంకట రమణారెడ్డి, రైతుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గొర్రె సాగర్, చిట్యాల పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన మండల అధ్యక్షుడు తౌటం నవీన్, ఏరుకొండ రాజేందర్, బుర్ర శ్రీధర్ గౌడ్, జోరుక సదయ్య, బందెల నరేష్, దామెర రాజు, చీరాల సదానందం, చిలుముల రమణాచారి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.