శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు కృషి చేయాలి

  • రఘునాథ్ వెరబెల్లి పిలుపు

దండేపల్లి, ఆంధ్రప్రభ: దేశ సమగ్రత, ఐక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి కొనియాడారు. సోమవారం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదనేది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలమైన ఆకాంక్ష అని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు లక్ష్యంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ కార్యకర్తలు దేశాభివృద్ధి, ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బందెల రవి గౌడ్, నాయకులు గోపతి రాజయ్య, బత్తుల శేఖర్, గడికొప్పుల సురేందర్, ముత్తె వెంకటేష్, ముత్తె అనిల్ తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.