ఐటీ పార్క్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

  • డీసీఎం ఢీకొని కూలీ మృతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం ఐటీ పార్క్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోయలగూడెం గ్రామానికి చెందిన అల్మాస్‌పేట యాదయ్య (53) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

సోమవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో మల్కాపురం వైట్ పార్క్ సమీపంలో కూలీ పనికి వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఐటీ పార్క్ ప్రధాన గేటుకు వంద మీటర్ల దూరంలో ఎదురుగా అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ యాదయ్య బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో యాదయ్య బైక్‌పై నుంచి కిందపడగా ఎడమ కాలు నుజ్జునుజ్జయ్యింది. ఛాతి, ముఖ భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అల్మాస్‌పేట నరసమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ మన్మధ్ కుమార్ తెలిపారు.