వడ్డీ దందాపై నిఘా..
- కదిలిన ఇంటెలిజెన్స్ వర్గాలల వివరాల సేకరణ
- అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలపై వివరాల సేకరణ జరుగుతున్నట్లు సమాచారం
- అప్పుల పేరుతో ఆస్తుల బదలాయింపుల కోణంలోనూ ఆరా
- బాధితుల నుంచి ఫిర్యాదులు, పత్రాలు సేకరిస్తున్నారనే చర్చ
- చిన్న వడ్డీ వ్యాపారులపై చర్యలు… పెద్దలపై మౌనమెందుకనే ప్రశ్నలు
- త్వరలో కీలక నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నగరంలో అక్రమ వడ్డీ వ్యాపారాలపై ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలు అధికార యంత్రాంగంలోనూ చర్చకు దారితీసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనంలోని ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ప్రాథమిక సమాచారం సేకరిస్తోందని ప్రచారం జరుగుతోంది.
అక్రమ ఫైనాన్స్ లావాదేవీలు, బాధితుల ఆరోపణలు, ఆస్తుల బదలాయింపుల అంశాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫిర్యాదులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, అప్పు లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు బాధితులతోనూ అనధికారికంగా మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది.
పూర్తి వివరాలను సమీకరించిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక అందించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఆస్తుల బదలాయింపులపై ప్రత్యేక దృష్టి
అప్పు ఇచ్చి షూరిటీ పేరుతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారాలపైనా నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. అసలు అప్పు ఎంత, తిరిగి చెల్లింపులు ఎంత, చివరకు ఆస్తుల యాజమాన్యం ఎలా మారిందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నమోదైన పత్రాలను కూడా పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కొన్ని లావాదేవీలు సాధారణ ఫైనాన్స్‌కు భిన్నంగా ఉన్నాయా అనే కోణంలోనూ విశ్లేషణ జరుగుతోందని సమాచారం. బాధితులు అందజేసినట్లు చెబుతున్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఒప్పంద పత్రాలపైనా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో ఆర్థిక నేరాల కోణం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు
ఇదిలా ఉండగా, చిన్నస్థాయి వడ్డీ వ్యాపారులపై తరచూ దాడులు నిర్వహిస్తూ అప్పు పత్రాలను స్వాధీనం చేసుకునే పోలీసులు, పెద్ద మొత్తాల్లో లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్న వ్యవహారాల్లో ఎందుకు అదే స్థాయిలో స్పందించడం లేదనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులు ఉన్నప్పటికీ చర్యలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనే చర్చ సాగుతోంది. అక్రమ వడ్డీ వ్యాపారంపై ఒకే విధమైన చట్టం అమలవ్వాల్సి ఉండగా, అమలులో తేడాలు ఎందుకు వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులపై ప్రభావం చూపే వ్యవహారాల్లో ఆలస్యం మరిన్ని బాధితులను పెంచుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
దీనిపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. చట్టం ముందు అందరూ సమానమేననే నమ్మకం కల్పించే చర్యలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిఘా వర్గాల పరిశీలన తర్వాత అయినా ఈ వ్యవహారంలో స్పష్టత వస్తుందేమోనని బాధితులు ఎదురుచూస్తున్నారు.
కీలక నివేదిక కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం వివిధ కోణాల్లో సమాచారం సేకరణ జరుగుతోందనే ప్రచారం ఖమ్మంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవేళ ప్రాథమిక సమాచారంలో ఆరోపణలకు బలం లభిస్తే సంబంధిత శాఖలు మరింత లోతైన విచారణ చేపట్టే అవకాశముందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఆరోపణలు నిరాధారమైతే అదే విషయాన్ని కూడా స్పష్టంగా తేల్చాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన లేకపోయినా, నిఘా వర్గాల కదలికలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. పూర్తి నివేదిక వెలువడిన తర్వాతే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పటి వరకు ఈ వ్యవహారంపై అనేక ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
