మా ఊరి పిల్లలు…మా ప్రభుత్వ బడిలోనే చదువుతారు
- ప్రైవేట్ బస్సులను మా ఊరిలోకి రానివ్వం
- కన్కల్ గ్రామ సభలో గ్రామస్తుల తీర్మానం
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను రానివ్వమంటూ ముక్తకంఠంతో గ్రామస్తులు గ్రామసభ నిర్వహించి మరీ తీర్మానం చేశారు. వివరాల్లోకి వెళితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులు పంపకుండా మా ప్రభుత్వ బడిలోనే మా పిల్లలు చదువుకుంటారు అంటూ ప్రభుత్వ బడిలో పిల్లలని చేర్పించిన ఘటన కన్కల్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ మహేష్,పాలకవర్గ సభ్యులు, కలసి ప్రభుత్వ బడిలో బీఈడీ, పీహెచ్డీ చేసిన అధ్యాపకులు,నాణ్యమైన విద్యా బోధన తో కూడిన ప్రభుత్వ బడిలో విద్యని అందిస్తున్న, మనం మాత్రం ఇంటర్మీడియట్, డిగ్రీ చేసిన ప్రైవేట్ పాఠశాలలకు అచ్చిరాన్ని ఇంగ్లీష్ మీడియాలకు మన పిల్లల్ని పంపుతున్నామని తెలియజేశారు. వేళల్లో డబ్బులను కడుతూ ప్రైవేట్ పాఠశాలలకు పంపడం కన్నా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలకు పంపడం మంచిదని నిర్ణయంతో గ్రామ ప్రజల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగిందని అన్నారు.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం ప్రైమరీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు, ఉన్నత పాఠశాలలో 55 మంది విద్యార్థులు చేర్పించడం జరిగిందని అన్నారు. ఇలాంటి మంచి పని చేస్తున్న మా పాలకవర్గంపై కొంతమంది ప్రైవేట్ పాఠశాల యజమాన్యంతో కుమ్మక్కై మాపై కేసులు పెట్టారని అన్నారు. మంచి పని చేస్తే ఇలాంటి కేసులు కూడా పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరి కోసం ప్రభుత్వ పాఠశాల భవిష్యత్తు కోసం ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు.గ్రామసభ నిర్వహించి పిల్లల తల్లిదండ్రుల సహకారంతో మా ఊరి బడిలోనే చదివేలా చూస్తున్నామని అన్నారు.
మా గ్రామం మా ప్రభుత్వ బడి జిల్లా లెవల్ లో తెలిసిందని, ఈ విషయమై గ్రామ ప్రజలు గ్రహించాలని తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలకి 20 మందితో కూడిన విద్యా కమిటీని కూడా ఏర్పాటు చేశామని సర్పంచ్ రవీందర్ రెడ్డి అన్నారు.ఈ విషయమై జిల్ల కలెక్టర్ ను కూడా కలుస్తామని, విద్యతోపాటు గ్రామ లో ఉన్న వైద్యానికి కూడా మా పాలకవర్గ సభ్యులు ఎప్పుడు ముందుంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మహిళారం రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, పాలకవర్గ సభ్యులు, పాఠశాల విద్యా కమిటీ సభ్యులు,గ్రామస్తులు,మహిళలు పాల్గొన్నారు.
