gold-monetisation-scheme-revamp-india-gold-imports | పసిడిపై కేంద్రం కొత్త వ్యూహం.. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కొత్త రూపు
gold-monetisation-scheme-revamp-india-gold-imports | పసిడిపై కేంద్రం కొత్త వ్యూహం.. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కొత్త రూపు
పసిడి దిగుమతుల నియంత్రణపై కేంద్రం ఫోకస్
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌కు కొత్త రూపు.. జ్యువెలర్లకు కీలక పాత్ర?
దేశంలో వేల టన్నుల బంగారం.. అయినా విదేశాల నుంచే దిగుమతులు
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
ఎందుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయింది?
ఈసారి కేంద్రం ఏం మార్చబోతోంది?
భారతీయులకు బంగారం పెట్టుబడి మాత్రమే కాదు.. భావోద్వేగం కూడా
ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, డాలర్ బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్ దిగుమతి వ్యయాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం చూపుతున్న బంగారం దిగుమతులను తగ్గించేందుకు మరోసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)కు పదును పెట్టాలని భావిస్తోంది.

కొంతకాలం క్రితం హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను అవసరం లేని బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరారు. ఉత్పాదక ఆస్తులపై పెట్టుబడులు పెట్టాలని సూచించారు. బులియన్ మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, ఆ పిలుపు తర్వాత కొత్త బంగారం కొనుగోళ్లలో కొంత మందగమనం కనిపించినప్పటికీ, ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లు మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గలేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో సమూల మార్పులు చేసి, ఆగస్టులో కొత్త రూపంలో తీసుకురావాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. జ్యువెలరీ వ్యాపారులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత రెండు వారాలుగా కేంద్ర మంత్రులు, ఆర్‌బీఐ, బ్యాంకులు, బులియన్ పరిశ్రమ ప్రతినిధుల మధ్య వరుస సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది.
దేశంలోనే వేల టన్నుల పసిడి… అయినా దిగుమతులే ఆధారం

భారతీయ కుటుంబాలు, దేవాలయాలు, ట్రస్టుల వద్ద 25 వేల నుంచి 50 వేల టన్నుల వరకు బంగారం నిల్వగా ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC), పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీని విలువ సుమారు ఐదు లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.475 లక్షల కోట్లు). ఇది దేశ జీడీపీలో నాలుగో వంతుకు సమానమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంత భారీగా బంగారం దేశంలోనే ఉన్నప్పటికీ, ప్రతి ఏడాది 700 నుంచి 900 టన్నుల వరకు బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా కరెంట్ అకౌంట్ లోటు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే నిల్వ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే కేంద్రం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
ఏమిటీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్?

2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద ప్రజలు తమ వద్ద ఉపయోగంలో లేని బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. నాణేలు, బంగారు కడ్డీలు, రత్నాలు తొలగించిన ఆభరణాలను కూడా జమ చేయవచ్చు. కనీసం 10 గ్రాముల బంగారం అవసరం. గరిష్ఠ పరిమితి లేదు.
డిపాజిట్ చేసిన బంగారాన్ని శుద్ధి చేసి 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ బార్లుగా మారుస్తారు. ప్రారంభంలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్ పథకాలు అమల్లో ఉండేవి. అయితే 2025 మార్చిలో మధ్య, దీర్ఘకాలిక డిపాజిట్ పథకాలను కేంద్రం నిలిపివేసింది.
ఎందుకు విఫలమైంది?
పథకం ఉద్దేశం మంచిదే అయినా, అమలులో అనేక లోపాలు ఎదురయ్యాయి.
వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటం.
ఆభరణాలు కరిగిపోతాయనే భావోద్వేగ అంశం.
కుటుంబ వారసత్వ నగలను కోల్పోతామనే భయం.
బంగారం స్వచ్ఛత పరీక్షలపై సందేహాలు.
బ్యాంకులు కూడా పెద్దగా ప్రచారం చేయకపోవడం.
పన్ను, ప్రక్రియలపై స్పష్టత లేకపోవడం.
దీంతో 11 సంవత్సరాల్లో కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే సమీకరించగలిగింది.
ఈసారి ఏం మారే అవకాశం ఉంది?
విశ్వాసనీయ సమాచారం మేరకు
జ్యువెలర్లను నేరుగా భాగస్వాములను చేసే అవకాశం.
డిపాజిట్ ప్రక్రియను సులభతరం చేయడం.
వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీ.
మరిన్ని గోల్డ్ కలెక్షన్ సెంటర్లు.
డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ.
బంగారం తిరిగి పొందే విధానంలో మరింత పారదర్శకత.
ఇలాంటి మార్పులు ఉంటే పథకానికి స్పందన పెరిగే అవకాశముందని బులియన్ రంగం భావిస్తోంది.
బంగారం భారతీయులకు భావోద్వెగానికి ప్రతీక

భారతీయులకు బంగారం కేవలం పెట్టుబడి కాదు. అది కుటుంబ సంపద, సంప్రదాయం, భావోద్వేగానికి ప్రతీక. నగలను కరిగించి బ్యాంకులో పెట్టేందుకు చాలా మంది ఇప్పటికీ సిద్ధంగా లేరు. ఈసారి ప్రభుత్వం జ్యువెలర్లను భాగస్వాములను చేస్తే ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అలాగే మార్కెట్‌కు అనుగుణంగా వడ్డీ, తక్షణ లిక్విడిటీ, పారదర్శక ప్రక్రియ, పన్ను రాయితీలు వంటి ప్రోత్సాహకాలు ఇస్తేనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ విజయవంతమవుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిలో ఉండటం కూడా ప్రభుత్వానికి అనుకూల అంశమే. అధిక ధరల సమయంలో కొంతమంది తమ వద్ద ఉన్న నిరుపయోగ బంగారాన్ని డిపాజిట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడమే ఈ పథకం విజయానికి అసలైన పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు.
Also Read
