120 ఏళ్ల పురాతన శివాలయంలో లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠ…

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని)..
ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు అభినందనలు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ గవర్నర్‌పేటలోని చల్లపల్లి బంగ్లా సమీపంలో 120 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం గురువారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తుల అనుగ్రహంతో విజయవాడ పార్లమెంట్ ప్రజలకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠతో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన కమిటీ సభ్యులు, దాతలను అభినందించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎంపీ చిన్ని కి వేదాశీర్వచనం అందించగా, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఈవో యడ్లపల్లి సీతారామయ్యతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.