డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యల పరిష్కారానికి కృషి: వొడ్నాల శ్రీనివాస్
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్‌రూమ్ కాలనీని సందర్శించిన ఆయన, అక్కడి నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, చెట్ల పొదల తొలగింపు, ప్రహరీ గోడ నిర్మాణం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ మునిసిపల్ కమిషనర్ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు.
2019లో అప్పటి ప్రభుత్వం సుమారు రూ.15 కోట్లతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినప్పటికీ, లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులో జాప్యం జరిగిందని అన్నారు. దీంతో ఇళ్లు ఖాళీగా ఉండి కిటికీలు, తలుపులు, నీటి ట్యాంకులు దెబ్బతిన్నాయని, ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
క్యాతనపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పల్లె రాజు, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, పల్లె శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ యాకూబ్ అలీ, మాజీ చైర్‌పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పచ్చిక లక్ష్మారెడ్డి, కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, నాగుల రాజ్‌కుమార్, జోగుల వెంకటేశ్వర్లు, ఎర్రల శంకర్, నక్క శ్రీనివాస్, నేరెళ్ల చంద్రయ్య, కొక్కుల సతీష్, మహిళా నాయకురాళ్లు రాజేశ్వరి, పుష్ప, దీప తదితరులు పాల్గొన్నారు.
