ప్రజా సేవలో ఎమ్మెల్యే వంశీకృష్ణ..

ఉచిత సర్జికల్ క్యాంప్‌లో సేవలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ: ప్రజా సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన నాలుగో ఉచిత సర్జికల్ క్యాంప్‌లో స్వయంగా శస్త్రచికిత్సలు నిర్వహించి పేద రోగులకు వైద్య సేవలు అందించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వైద్యుడిగా సేవలందించడం స్థానికులను ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఇటీవల శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందించడమే తన బాధ్యత అని తెలిపారు.

అనంతరం ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే వంశీకృష్ణ సమయపాలన పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజాధనంతో సేవలందిస్తున్న వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.