వీబీజీరామ్‌జీ పథకాన్నిరద్దు చేయాలి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి.
నారాయణపేట సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం వి బి జి రామ్ జి పథకాన్ని వెంటనే రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని నారాయణపేట జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు జి. వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిరసన చేపట్టి ఎంపీడీవో పావనికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బి జి రాంజీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మళ్లీ వలసలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భరించే నిధుల శాతం తగ్గడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా చెల్లించుకోలేక కూలీలకు పని దినాలు తగ్గడం అనివార్యంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత యూపీఏ ప్రభుత్వం అనేక ఉద్యమాల అనంతరం కూలీలకు ఒక మంచి చట్టం తీసుకొచ్చిందన్నారు.

ఉపాధి హామీ పథకం అమలు రావడం ఇష్టం లేని కార్పొరేట్ వర్గాలకు వత్తాసు పలికే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధికి ఉరి వేసే ఉద్దేశంతో వి బి జి రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కూలీలకు నష్టం కలిగించే ఈ పథకాన్ని రద్దుచేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బి. నారాయణ, తెలంగాణ రైతు సంఘం మండల కన్వీనర్ శివప్ప గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎల్. కురుమన్న,డివైఎఫ్ఐ నాయకులు కమ్మరి రవి వ్యవసాయ కూలీలు చింతలప్ప, కథలప్ప తదితరులు పాల్గొన్నారు.