చేనేత సహకార సంఘం ఎన్నికలు

  • ‘శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి’ ప్యానెల్ నామినేషన్

చౌటుప్పల్, ​ఆంధ్రప్రభ : చేనేత సహకార సంఘం ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ‘శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి’ ప్యానెల్ సభ్యులు గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. ​ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి చేనేత సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ కందగట్ల బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బడుగుల లక్ష్మయ్య, పురపాలక వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్యానెల్ అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ​సహకార సంఘం పూర్వ వైభవం, చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బరిలోకి దిగిన ఈ ప్యానెల్ నామినేషన్ల కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు గోశిక చక్రపాణి, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ, సంఘం ఉపాధ్యక్షులు బడుగు అంజయ్య, శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం అధ్యక్షులు బడుగు జయప్రకాష్, డైరెక్టర్ గోశిక చంద్రకళ తదితరులు పాల్గొని అభ్యర్థులను ఉత్సాహపరిచారు.

​కాగా ​శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ప్యానెల్ తరఫున ఎన్నికల బరిలో నిలుస్తూ నామినేషన్లు వేసిన వారిలో బడుగు మోహన్ బాబు, గోశిక శ్రీకాంత్, కాటబత్తిని భీమయ్య, ​గోశిక నరసింహ, దోర్నాల లక్ష్మీనారాయణ, పాపని రామకృష్ణ, గోశిక లక్ష్మీపతి, ​బడుగు సావిత్రమ్మ, బత్తుల మానస ​తదితరులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. చేనేత కార్మికుల అభివృద్ధికి, సంఘం బలోపేతానికి తమ ప్యానెల్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్యానెల్ ప్రతినిధులు, పెద్దలు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు, ప్యానెల్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.