దశాబ్దాల వ్య‌ధ‌… వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ…

ఆంధ్రప్రభ’ కథనాలే వారికి అండ.
50 ఏళ్ల వలస కార్మికుల జీవితాల్లో మార్పుకు శ్రీకారం
ఆంధ్రప్రభ కథనాలతో స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..
అధికారులతో కలిసి గడ్డమణుగు లోయలో పర్యటన
ఒడిస్సా వలస కార్మికుల దుర్భర జీవనంపై ప్రత్యక్ష పరిశీలన..
సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే వసంత
తాగునీటి కోసం వెంటనే ఆర్వో ప్లాంట్, పైప్‌లైన్ ఏర్పాటు..
భూగర్భ జలాల కాలుష్యంపై పీసీబీకి లేఖ..
ఇళ్ల స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ అధికారులకు సూచనలు..
విద్యుత్, రహదారి, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పనకు హామీ..
ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చర్యలు
భరోసా కల్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ నగరానికి కూతవేటు దూరంలోనే ఐదు దశాబ్దాలుగా కనీస వసతులు లేక నరకయాతన అనుభవిస్తున్న ఒడిస్సా వలస కార్మికుల దయనీయ జీవనాన్ని ఆంధ్రప్రభ వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం స్పందించింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గురువారం అధికార యంత్రాంగంతో కలిసి జి.కొండూరు మండలం గడ్డమణుగు లోయను సందర్శించి కార్మికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, తక్షణ పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

దశాబ్దాలుగా తీరని వ్య‌ధ‌…

తాగడానికి గుక్కెడు మంచినీరు లేక, పిల్లలకు చదువుకునే పాఠశాల లేక, రహదారి, విద్యుత్, పారిశుధ్యం వంటి కనీస వసతులు లేక దశాబ్దాలుగా దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న ఒడిస్సా వలస కార్మికుల జీవితాన్ని ఆంధ్రప్రభ కథనాలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఆధార్, ఓటరు కార్డులు ఉన్నప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు అందక ఇబ్బందులు పడుతున్న వాస్తవాన్ని కూడా వెలుగులోకి తెచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అధికారులతో కలిసి గడ్డమణుగు లోయలోని కార్మికుల కాలనీలో పర్యటించారు. ప్రతి కుటుంబంతో మాట్లాడి వారి జీవన పరిస్థితులను పరిశీలించారు.

ఇళ్ల స్థలాలు, తాగునీటి సదుపాయం కల్పించాలని కార్మికులు కోరగా, వెంటనే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసి పైప్‌లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ నిర్వహణ బాధ్యతను తామే చేపడతామని కార్మికులు అంగీకరించడంతో ఆలస్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్న ఫిర్యాదుపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కి లేఖ రాస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు హామీ ఇచ్చారు.

విద్యుత్, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వలస కార్మికుల పిల్లల విద్య, కుటుంబాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహసీల్దార్, వీఆర్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని, జనరల్ పొజిషన్ సర్టిఫికెట్‌తో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని కార్మికులకు వివరించారు.