బాధిత కుటుంబాలను పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం భీమ్‌గల్ మండలంలోని పలువురు కుటుంబాలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ప్రమాదంలో గాయపడిన పార్టీ నాయకుడిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

రహత్‌నగర్ గ్రామానికి చెందిన దొంతుల నర్సయ్య సోదరుడు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ముచ్కూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు ఒజ్జెం భూమేష్ నానమ్మ మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జగిర్యాల్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ సంగెం రాజేశ్వర్ ప్రమాదవశాత్తు కాలు విరిగి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండటంతో ఆయనను కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే భీమ్‌గల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సజీద్ (ముజ్జు) కుటుంబంలో ఆయన అన్న అర్షత్ కుమార్తె విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, సర్పంచ్ గడల ప్రసాద్, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, రైతు బంధు మండల అధ్యక్షుడు శర్మ నాయక్, మాజీ సర్పంచ్ తిరుపతి, పార్టీ నాయకులు బీ. నర్సయ్య, మల్లెల ప్రసాద్, పల్లికొండ అజయ్, కార్యకర్తలు పాల్గొన్నారు.